FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Vol. No. II | Issue No. 7 | Monthly News Letter | July 2026
IN FOCUS
పౌరసత్వానికి ధృవీకరణ పత్రం
ఒక వ్యక్తిని చట్టబద్ధంగా దేశ పౌరుడిగా గుర్తించడాన్ని పౌరసత్వం అంటారు. అమెరికాలో లాగా మనదేశంలో ద్వంద్వ పౌరసత్వం లేదు. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో నివసించే వారిని భారతీయ పౌరులు అంటారు.
దేశంలో ఉండే ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి భారతీయపౌరులు, రెండు విదేశీయులు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు చాలా విదేశీయులకు వర్తించవు. ఉదాహరణకు ఎన్నికలలో పోటీచేసే హక్కు, ఎన్నికలలో ఓటు వేసే హక్కు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కొనసాగే హక్కు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించే హక్కు భారత దేశ పౌరులకు మాత్రమే ఉంటుంది. భారత రాజ్యాంగంలోని రెండో భాగంలోని ఆర్టికల్ 5 నుండి 11 వరకు గల ఆర్టికల్ లలో భారత పౌరసత్వానికి సంబంధించిన అంశాలు వివరించడం జరిగింది.
ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వేసిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ మంత్రత్వ శాఖ పాస్‌పోర్ట్ పౌరసత్వానికి గుర్తింపు పత్రం కాదని స్పష్టం చేసింది.
విదేశాలలో భారతీయులు ప్రయాణం చేస్తున్నప్పుడు భారత పాస్‌పోర్టును భారతీయు పౌరసత్వానికి ప్రమాణపత్రంగా గుర్తిస్తున్నారు. అయితే చట్టం దృష్టిలో భారతీయ పాస్‌పోర్టు అనేది భారతీయ పౌరసత్వానికి ఋజువు పత్రం కాదంటుంది మన విదేశాంగ మంత్రత్వ శాఖ. పాస్‌పోర్టు యాక్ట్ 1967లోని 62 “ఎ” ప్రకారం భారతీయులు కాని వారికి ప్రభుత్వం పాస్‌పోర్టు జారీని నిరాకరించవచ్చు. అయితే ఇదే యాక్ట్ చట్టంలోని 20వ సెక్షన్ 6 ను అనుసరించి భారతీయులు కాని వారికి కూడా కేంద్రప్రభుత్వం పాస్‌పోర్టు లేదా ప్రయాణ ధృవపత్రం (Travel Document) అనివార్యమైన పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని జారీ చేయవచ్చు. ఈ కారణంగానే విదేశీయాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్టు భారత పౌరసత్వానికి ఋజువు కాదన్నట్లు భావించాల్సి వస్తుంది. గమనార్హమైన అంశం ఏమిటంటే పౌరసత్వం నిర్ణయం అనేది పౌరసత్వ చట్టం 1955 ఆధారంగా నిర్ణయిస్తారు. పాస్‌పోర్టు అనేది 1969 పాస్‌పోర్టు చట్టం ఆధారంగా జారీ చేస్తారు.
ఆధార్‌ను భారత పౌరసత్వం ఋజువు పత్రంగా భావించవచ్చా ?
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (Unic Identification Activation of India) అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్ట బద్ధమైన సంస్థ. ఈ సంస్థకు ఆధార్ కార్డును జారీ చేసే అధికారం కలిగి ఉంది. ఆధార్ కార్డును అనేక సందర్భాల్లో ఋజువు పత్రంగా ఆమోదిస్తున్నారు. ఆధార్ కార్డు జారీని అధికారికంగా జనవరి 28, 2009 న ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రధమ ఆధార్ నంబరుగా సెప్టెంబర్ 29, 2017లో ప్రారంభించారు. ఈ కార్డులో 12 అంకెలు ఉంటాయి. బయోమెట్రిక్స్, డెమోగ్రఫిక్స్ ఆధారంగా ఈ పత్రాన్ని జారీ చేస్తారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌ను పౌరసత్వ ఋజువు పత్రంగా గుర్తించవచ్చా అన్న అంశంపై వివరణ ఇస్తూ ఆధార్ అనేది వ్యక్తుల గుర్తింపు పత్రమని ఆ వ్యక్తి చిరునామాకు ఆధారమని పౌరసత్వ గుర్తింపు పత్రం కాదని వివరణ ఇచ్చింది. నిజానికి భారతదేశ పౌరులు కాని వ్యక్తులై ఉండి చట్టబద్ధంగా భారతదేశంలో నివసిస్తున్న వారికి కూడా ఆధార్‌ను జారీ చేస్తారు. అనేక ప్రభుత్వ సేవలకు ఆధార్ ప్రధానంగా గుర్తింపు పత్రం. 2026 మే 27న SIR విచారణ సందర్భంగా ఆధార్ ప్రస్థావన వచ్చినప్పుడు ఆధార్‌ను పౌరసత్వానికి గుర్తింపు పత్రంగా గుర్తించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓటర్ గుర్తింపు పత్రాన్ని పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావించవచ్చా అనేది ఒక ప్రశ్న. ప్రస్థుతం మన దేశంలోని 16 రాష్ట్రాలలోనిర్వహిస్తున్న SIR సందర్భంగా పాస్‌పోర్టును భారత పౌరసత్వ గుర్తింపు కార్డుగా పరిగణించవచ్చా అన్న సందర్భంలో దేశీయంగా మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణ ఇది.
ఓటర్ గుర్తింపు పత్రాన్ని పౌరసత్వ గుర్తింపు పత్రంగా భావించవచ్చా ?
భారతదేశంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుండి 329 ప్రకారం జనవరి 25, 1950వ సంవత్సరంలో భారత ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయపౌరులు మాత్రమే మనదేశంలో ఎన్నికల్లో ఓటు చేయడానికి అర్హులు. ఎన్నికల జాబితాలోని ఓటర్ లిస్టులో పేరు ఉన్నా ఎన్నికల కమీషన్ జారీ చేసిన ఫోటోతో కూడిన ఎన్నికల గుర్తింపు కార్డు ఉన్నా అవి భారత పౌరసత్వ నిరూపణకు ధృవీకరణ పత్రాలుగా ఉపయోగపడవు.
2026వ సంవత్సరం SIR పై జరిగిన విచారణ సందర్బంగా భారత్‌లో ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఎన్నికల కమీషన్‌ను ఓటర్ల జాబితాలో ఎవరి పేరు ఉండవచ్చు అన్న అంశంపై నిర్ణయాధికారం కలిగి ఉందని పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోవడానికి నిర్ణయాలు తీసుకోవడానికి అధికాంర లేదని విశదీకరించింది. అనేకమంది భారతీయులు దగ్గర వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఏ రకమైన చట్టపరమైన ఋజువులు ప్రస్థుతానికి లేవు.
ఇది దేశ ప్రజల్లో అలజడిని, ఆందోళనలను సృష్టిస్తోంది.
దేశపౌరుడిగా నిరూపించుకోవాలంటే ఏ పత్రాలు ప్రామాణికమని భారత పౌరులు అడుగుతున్నారు ?
సందర్భోచితంగా భారతీయులు జనన ధృవీకరణ పత్రం ద్వారా పుట్టిన ప్రదేశం ద్వారా తల్లిదండ్రుల నివాసము ఆధారంగా వారి భారతీయ పౌరసత్వాన్ని నిరూపించుకుంటున్నారు. ఈ కారణంగా బారతీయులందరికీ వారు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక చట్టబద్ధమైన అధికారిక పత్రం రూపొందించాలని అభిలషిస్తున్నారు.
డా . పి. మోహన్‌రావు
మెంబరు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
అధికారం, డబ్బు మనిషి జీవితానికి సాధనాలు మాత్రమే, లక్ష్యాలు కావు. మంచి వ్యక్తిత్వం, విలువలు, సేవాభావం, సమాజానికి మేలు చేయాలనే తపనే నిజమైన లక్ష్యాలు.
ప్రజాధనం ప్రజల కోసమే !
ప్రజాధనంతో మంత్రుల పన్ను ? రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం !
ప్రజాస్వామ్యంలో చట్టం ముందు అందరూ సమానులనే సూత్రం అత్యంత ప్రాథమికమైనది. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన బాధ్యతలను నిర్థారించింది. కానీ తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన ఇతర ప్రముఖుల ఆదాయపు పన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే విధానం కొనసాగుతుండటం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తోంది.
పన్ను నుండి ఎవరూ తప్పించుకోలేరు కానీ …..
ఒక రైతు తన కష్టార్జిత ఆదాయంపై పన్ను చెల్లించాల్సిందే. ఒక ఉపాధ్యాయురాలు తన జీతంలో భాగాన్ని ఆదాయపు పన్నుగా చెల్లిస్తుంది. ఒక కార్మికుడు తన శ్రమ ఫలితంగా సంపాదించిన ఆదాయంపై విధించిన పన్నును తప్పించుకోలేడు. సామాన్యపౌరుడికి చట్టం నుంచి మినహాయింపు లేదు. అయితే అధికారంలో ఉన్నవారి వ్యక్తిగత ఆదాయపు పన్నును మాత్రం ప్రజల డబ్బుతో చెల్లించడం ఎలా సమర్థనీయమవుతుంది ? ఈ అంశాన్ని చాలా కాలంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (FGG) లేవనెత్తుతోంది. ఫోరం అధ్యక్షుడు యం. పద్మనాభరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి, ఈ విధానాన్ని రద్దుచేయాలని కోరారు. ప్రభుత్వ స్పందన లేకపోవడంతో రాష్ట్ర గవర్నర్‌కు కూడా వినతిపత్రం అందజేశారు. ప్రజాధనాన్ని వ్యక్తిగత పన్ను బాధ్యతల కోసం వినియోగించడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం.
నిబంధన పాతదైతే న్యాయ సమ్మతమవుతుందా ?
భారత రాజ్యాంగంలోని అధికరణ – 14 ప్రతి పౌరుడికి చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తుంది. సాధారణ ఉద్యోగి తన ఆదాయపు పన్నును స్వయంగా చెల్లించాల్సి వస్తే , ప్రజాప్రతినిధుల పన్నును మాత్రం ప్రజలే భరించడం సమానత్వ సూత్రానికి విరుద్ధంగా కనిపిస్తోంది. ఒక చట్టం పేదలకు, మరో చట్టం అధికార వర్గాలకు వర్తించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుకూలం కాదు. ఈ విధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అమలులో ఉన్న
Andhra Pradesh Payment of Salaries, Pensions and Removal of Disqualifications Act 1953 లోని నిబంధనల ఆధారంగా కొనసాగుతోందని తెలుస్తోంది. అయితే ఒక నిబంధన పాతదై ఉండటం వల్ల అది న్యాయ సమ్మతమవుతుందని చెప్పలేం. కాలానుగుణంగా చట్టాలను సమీక్షించడం ప్రభుత్వ బాధ్యత. ఈ సౌకర్యాన్ని పొందుతున్న ప్రజాప్రతినిధుల వివరాలను సమాచార హక్కు చట్టం క్రింద కోరినప్పుడు, అది వ్యక్తిగత సమాచారం అంటూ వెల్లడించలేమన్న సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రజల పన్నుల డబ్బుతో చెల్లింపులు జరుగుతున్నప్పుడు, ఆ సమాచారం పూర్తిగా ప్రజా ప్రయోజనానికి సంబంధించినదే. ప్రజాధనం ఎక్కడ ఖర్చవుతుందో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా ?
సమానత్వం ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబించాలి !
ప్రజల నుంచి వసూలు చేసే పన్నులు పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, త్రాగునీటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలి. కానీ అదే నిధులను ఇప్పటికే అధికార హోదాలు, వేతనాలు, భత్యాలు పొందుతున్న వ్యక్తుల వ్యక్తిగత ఆదాయపు పన్నుల చెల్లింపులకు వినియోగించడం సమంజసం కాదు. ప్రజాసేవ ప్రత్యేక హక్కు కాదు, బాధ్యత. ప్రజల ఓట్లతో ఎన్నికైన నాయకులు సాధారణ పౌరుల కంటే ఎక్కువ జవాబుదారీతనం ప్రదర్శించాలి. ప్రజలు చెల్లించే పన్నును ప్రజాప్రతినిధులు కూడా చెల్లించాలి. పన్ను నుంచి సామాన్య పౌరుడు తప్పించుకోలేనప్పుడు, ప్రజాప్రతినిధులకు కూడా దాని నుంచి మినహాయింపు ఉండకూడదు. ప్రజల డబ్బుతో మంత్రుల వ్యక్తిగత ఆదాయపు పన్నులు చెల్లించడం నిజంగా షాకింగ్. ఇది పునః సమీక్షకు కాదు, తక్షణ సవరణకు అర్థమైన అంశం. ప్రజల డబ్బు ప్రజల కోసమే వినియోగించాలి. అధికార వర్గాల ప్రత్యేక ప్రయోజనాల కోసం కాదు. ప్రజాస్వామ్యంలో సమానత్వం రాజ్యాంగ పుస్తకాలలో మాత్రమే కాకుండా ప్రభుత్వ విధానాలలో కూడా ప్రతిబింబించాలి.
సయ్యద్ రఫీ
EC మెంబరు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు మీ శక్తికి అతివద్ద అడ్డంకులు. భావోద్వేగాలను వ్యక్తం చేయడం వల్ల కలిగే క్షణికానందం కంటే, దానివల్ల జరిగే నష్టమే ఎక్కువ. ఏ పరిస్థితుల్లోనైనా సంయమనం పాటించడమే నిజమైన శక్తికి, తెలివితేటలకు నిదర్శనం.
ఏమైంది మీకు?
తప్పు అని తెలిసి కూడా లంచం ఎందుకు?
ప్రభుత్వ ఉద్యోగం అనేది మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన బాధ్యతల్లో ఒకటి. లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలు కష్టపడి, పోటీ పరీక్షలు రాసి, కుటుంబాల ఆశలను నెరవేర్చుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి స్థిరమైన ఆదాయం, సమాజంలో గౌరవం, ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తాయి. అలాంటి విలువైన పదవిలో ఉన్న కొందరు అధికారులు, ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చులో చిక్కుతున్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి.
ప్రతి సారి అలాంటి వార్త వెలుగులోకి వచ్చినప్పుడు సమాజం అడిగే ఒకే ప్రశ్న – “ఏమైంది మీకు?”
లంచం తీసుకోవడం చట్టవిరుద్ధమని వారికి తెలియదా? తెలుసు. అవినీతి నిరోధక శాఖ నిఘా ఎలా ఉంటుందో తెలియదా? తెలుసు. లంచం తీసుకుంటే ఉద్యోగం, ప్రతిష్ఠ, భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని తెలియదా? అది కూడా తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు?
ఇది కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు. ప్రజలు ప్రభుత్వ వ్యవస్థపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయడం కూడా. ఒక సాధారణ పౌరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు తన పని న్యాయంగా, నియమాల ప్రకారం జరుగుతుందని ఆశిస్తాడు. కానీ లంచం లేకుండా పని జరగదనే భావన ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం బలహీనపడుతుంది.
ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడినప్పుడు నష్టం అతనికే పరిమితం కాదు. అతని కుటుంబం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని పిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. సహచర ఉద్యోగులపై కూడా అనుమానాల నీడ పడుతుంది. ఆ శాఖపై ప్రజల విశ్వాసం తగ్గుతుంది. ముఖ్యంగా నిజాయితీగా పనిచేస్తున్న వేలాది మంది అధికారుల కృషి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం కాదు. అది ఒక ప్రజా విశ్వాసం. ప్రజల తరఫున అధికారాన్ని వినియోగించే బాధ్యత. ఆ అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించినప్పుడు సమాజానికి తప్పు సందేశం వెళ్తుంది. “డబ్బు ఉంటేనే పని జరుగుతుంది” అనే భావన బలపడుతుంది. ఇది సమాజ నైతిక విలువలను క్రమంగా క్షీణింపజేస్తుంది.
కొంతమంది అధిక సంపాదన కోరికతో, మరికొందరు ఇతరులతో పోల్చుకోవడం వల్ల, ఇంకొందరు “అందరూ చేస్తున్నారు” అనే అపోహతో అవినీతి వైపు మొగ్గు చూపుతారు. కానీ చరిత్ర మనకు చెప్పిన ఒక సత్యం ఏమిటంటే – అక్రమంగా సంపాదించిన సంపద ఎన్నడూ శాశ్వత గౌరవాన్ని ఇవ్వలేదు. నిజాయితీతో సంపాదించిన పేరు మాత్రం తరతరాలకు నిలుస్తుంది.
ఈ రోజు తెలంగాణ అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్నాయి. అయితే అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు, పరిశ్రమలు మాత్రమే కాదు. నైతిక విలువలు, పారదర్శకత, ప్రజా బాధ్యత కూడా అంతే ముఖ్యమైనవి. అవినీతి పెరిగితే అభివృద్ధి ఫలాలు ప్రజలకు పూర్తిగా అందవు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఉద్యోగం కోసం పడిన కష్టం, తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ గౌరవం, సమాజంలో సంపాదించిన పేరు – ఇవన్నీ కొన్ని వేల రూపాయల లంచం కంటే తక్కువవా? ఒక క్షణిక ఆశ కోసం జీవితాంతం మచ్చ ఎందుకు మిగుల్చుకోవాలి?
ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. లంచం ఇవ్వడం కూడా తప్పే. పని త్వరగా జరగాలని లేదా నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందాలని లంచం ఇవ్వడం ద్వారా మనమే అవినీతిని ప్రోత్సహిస్తున్నాం. అవినీతి నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు; ప్రతి పౌరుడి బాధ్యత కూడా.
నిజాయితీ అనేది బలహీనత కాదు. అది ఒక వ్యక్తి యొక్క గొప్ప బలం. పదవి తాత్కాలికం. అధికారం తాత్కాలికం. సంపద కూడా శాశ్వతం కాదు. కానీ వ్యక్తిత్వం, గౌరవం, మంచి పేరు శాశ్వతమైనవి. పదవి విరమణ తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తుంచేది అతని నిజాయితీ, సేవాభావం, విలువలే.
అందుకే తెలంగాణ సమాజం మరోసారి ప్రశ్నిస్తోంది –
“ఏమైంది మీకు?”
ప్రజల విశ్వాసాన్ని కాపాడండి. మీ కుటుంబ గౌరవాన్ని కాపాడండి. మీ పదవికి ఉన్న విలువను కాపాడండి. తాత్కాలిక లాభాల కోసం జీవితాంతం మచ్చ తెచ్చుకోవద్దు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ వ్యక్తిగత జీవితానికే కాదు, సమాజ భవిష్యత్తుకూ సంబంధించినదని గుర్తుంచుకోండి.
సోమ శ్రీనివాస్ రెడ్డి
కార్యదర్శి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of JUNE 2026
- To the Chief Minister regarding Irregular promotions and postings of Thasildars in Revenue department. Request for inquiry – on 11-6-2026
- To the Prl Secretary, Municipal Administration & Urban Development department regarding Irregular issue of certificates by HMDA. About 2500 purchaser are affected by mistakes committed by HMDA. Request for inquiry by D.G. V&E – on 16-6-2026
- To the Prl. Secretary, Health Medical & Family Welfare department regarding Survey report by various research agencies. Request to order for inquiry to take appropriate action to prevent adulteration of milk – on 17-6-2026
- To the Chief Minister regarding Heavy pollution of the River Godavari. Request to take steps to control the pollution level through appropriate preventive measures – on 18-6-2026
- To the Governor, Telangana State regarding Payment of Income Tax by State Government in respect of Hon’ble Chief Minister, Dy. Chief Minister, other Ministers and Corporation Chairpersons and advisors having Cabinet rank. Request to stop this practice – on 23-6-2026
- To the Prl. Secretary, Revenue (Excise) department regarding conducted state-wide special Enforcement drive from 12th June to 21st Targeting illicit liquor. Request to conduct raids on adulterated (illicit) Toddy also – on 25-06-2026
FGG submitted following RTI letters to various departments in the month of JUNE 2026
- To the PIO, O/o Chairman & MD, TSSPDCL regarding Fake certificates – on 9-6-2026
- To the PIO, O/o Commissioner, School Education department regarding irregularities in department – on 9-6-2026
- To the PIO, O/o Prl. Secretary, Environment, Forest, Science & Technology department regarding status of Representation on Single Use Plastics – on 9-6-2026
- To the PIO, O/o Prl. Secretary, Health Medical & Family Welfare department regarding Action taken on the report of D.M.E. – on 9-6-2026
- To the PIO, O/o Director, Mines & Geology department, regarding provide the inquiry reports of Mining department on the irregular stone quarrying and sand mining etc. – on 16-6-2026
- To the PIO, O/o Director General, ACB, regarding disposal of cases during last Two and half years – on 17-6-2026
- To the PIO, O/o Secretary, State Legislative Assembly regarding the information about the salary, other Allowances paid to MLAs and MLCs for the month of May 2026 – on 25-6-2026
FGG TIMES
Forum For Good Governance
H.No.6-1-69, Flat No.204,
G.K.R. Mansion Saifabad,
Lakdikapool, Hyderabad,
Pin : 500004
Phone: 040 2323 0334
Editorial Board:
M. Padmanabha Reddy I.F.S.(R) (President)
Soma Srinivas Reddy B.E (Secretary)
Interested may send articles/ letters/ News to
E-mail: timesfgg@gmail.com