FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Vol. No. II | Issue No. 2 | Monthly News Letter | February 2026
IN FOCUS
కాలుష్య కోరలలో హైద్రాబాద్
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కమ్ముకున్న మేఘాలు
ఓటుకు నోటు – జాతికి చేటు
పేరే మారింది.. సాప్ట్‌వేర్ అదే..సమస్యలు అవే !
READERS WRITE
- Jan. 2026 issue
FGG IN NEWS
FGG IN ACTION
IN FOCUS
కాలుష్య కోరలలో హైద్రాబాద్
భారతదేశం నడిబొడ్డున డక్కన్ పీఠభూమిపై హైద్రాబాద్ ఏర్పడ్డది. ఎండాకాలము అధికంగా ఎండలు లేక అలాగే చలికాలంలో అధిక చలి లేక సమశీతోష్ణస్థితి తో నివసించడానికి చాలా అనువుగా ఉన్న పట్టణం ఇది. చార్మినార్, గోల్కొండ, చౌమొల్ల ప్యాలెస్, కుతుబ్‌షాహి టూంబ్స్, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి, విశ్వవిద్యాలయం వంటి కట్టడాలతో, నగరంలో నలుమూలల సిమెంట్ రోడ్లతో హైద్రాబాద్ నగరంలో రాజసం ఉట్టిపడుతుంది. ఇచ్చట అన్ని మతాల వారు దేశంలోని అన్ని ప్రాంతాల వారు సుఖంగా జీవిస్తున్నారు. అన్ని రాష్ట్రాల బాషలు, వంటకాలకు హైద్రాబాద్ నిలయం. నిజాం నవాబుల కాలంలో నిజాం రైల్వేస్, నిజాం కరెన్సీ, స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి వాటితో హైద్రాబాద్ ఒక స్వతంత్ర దేశానికి కావలసిన అన్ని హంగులు కలిగి ఉండేది. శాంతిభద్రతలు, సమశీతోష్ణస్థితి, స్నేహపూరిత వాతావరణాన్ని చూసి చాలామంది ముఖ్యంగా ఉత్తర భారతదేశ విశ్రాంత ఉద్యోగులు, వర్తకులు హైద్రాబాద్ నగరాన్ని తమ నివాసయోగ్యమైన నగరంగా ఎంచుకున్నారు. అయితే ఇదంతా పాత మాట. గత 20 సంవత్సరాలలో పరిస్థితులు మారినాయి. ఇప్పుడు హైద్రాబాద్‌లో ఇరుకు మరియు గతుకుల రోడ్లు, ట్రాఫిక్ జామ్‌లు, పొంగిపోర్లుతున్న డ్రైనేజీ, గాలి మరియు నీటి కాలుష్యం, ట్యాంక్‌బండ్ మరియు మూసి నుంచి వచ్చే కంపుతో నగర పూర్వ వైభవం మసకబారిపోతుంది.
కాలుష్యం ముఖ్యంగా గాలి, నీటి కాలుష్యం హైద్రాబాద్ నగరానికి ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ బోర్డు (Pollution Control Board – పి.సి.బి.) ఉన్నను దాని పని అంతంత మాత్రమే. పి.సి.బి. చైర్మన్ పదవికి నిష్ణాతులు, విషయ పరిజ్ఞానం కలిగిన అధికారిని నియమించకపోవడం, పి.సి.బి. మెంబర్ సెక్రటరీకి శాస్త్ర సాంకేతిక రంగాలలో అలాగే మెనేజ్‌మెంటులో నిష్ణాతుడై ఉన్నవారిని నియమించకపోవడం జరుగుతుంది. సుప్రీమ్‌కోర్టు వారు పి.సి.బి. చైర్‌పర్సన్ మరియు మెంబర్ సెక్రటరీ నియామకానికై సంబంధిత విషయాలలో నిష్ణాతులైన వారినే నియమించాలని చెప్పినా అమలుకావడం లేదు. ఇక పి.సి.బి.లో కావలసిన ఉద్యోగస్థులను భర్తీ చేయకపోవడంతో పి.సి.బి. రాష్ట్రంలో వాతావరణ కాలుష్యాన్ని సమర్థవంతంగా అరికట్టలేకపోతుంది. వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన పరిశ్రమల నుంచి, అలాగే వాహనాల నుంచి వచ్చే పొగ, మునిసిపల్ చెత్తను ఖాళీ ప్రదేశాలలో కాల్చుట, నగరం చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయ వ్యర్థాలను కాల్చుట వంటి వాటితో వాయు కాలుష్యం జరుగుతుంది. వాయు కాలుష్యాన్ని అరికట్టడంతో ప్రజలకు అవగాహన మరియు సహకారం తీసుకొనడంలో పి.సి.బి. ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి తోడు ఇరుకు మరియు గుంతల రోడ్లతో వాహనాలు మెల్లగా పోవడంతో పొగ అధికంగా వెలువడుతుంది. అదీకాక వాహనదారులు నడుము నొప్పి వంటి వాటితో బాధపడుతున్నారు. జి.హెచ్.యం.సి.లో కార్పోరేటర్ల విహారయాత్రలకు డబ్బు ఉంది కాని, రోడ్లపై గుంతలు పూడ్చడానికి డబ్బు లేదు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను అవుటర్ రింగ్ రోడ్డు బయటకు తరలిస్తామని ప్రకటన చేసినా పనిపూర్తి కాలేదు. నోటీసులు ఇచ్చి సరిపెట్టుకున్నారు. బాలానగర్‌లో కెమికల్ ఇండస్ట్రీను పూర్తిగా మూసివేయవలసిన అవసరముంది.
ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలు హర్షనీయమే అయితే ఇక 15 సంవత్సరములు పైబడిన ఆటోలు, ట్రక్కులు వంటివి విపరీతమైన పొగ వదులుతున్నాయి. ఈ విషయంలో రవాణా శాఖ కూడ చర్యలు గైకొనాలి. నగరంలోని కంకర రోడ్లు అన్నింటిని బ్లాక్ టాప్ రోడ్లుగా మార్చడం అలాగే భవన నిర్మాణంలో వచ్చే దుమ్ము, ధూళిని నియంత్రించడం జరగాలి. నగరం చుట్టుపక్కల గల స్టోన్ క్రషర్స్ నుంచి కూడ కాలుష్యమవుతుంది. దీనిని కూడ కంట్రోల్ చేయుటకు తగిన చర్యలు గైకొనాలి. దేశ రాజధాని ఢిల్లీలో రకరకాల కారణాలతో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగి పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదముంది. అట్టి పరిస్థితి హైద్రాబాద్ నగరానికి రాకుండా ఇప్పటి నుంచే చర్యలు గైకానాలి.
ఇక జల కాలుష్యం కూడ నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కొన్ని సందర్భాలలో మంచినీటి మరియు డ్రైనేజీ పైపులు పక్క పక్కనే ఉండి లీకేజీలతో త్రాగునీరు కలుషితమవుతుంది. ఈ మధ్య ఇండోర్ పట్టణంలో కలుషితమైన నీరు త్రాగి 15 మంది చనిపోవడం వందమంది వరకు ఆసుపత్రి పాలవడం వంటి దుర్ఘటనలు హైద్రాబాద్ నగరానికి పట్టకుండా ఉండాలి. చాలా ప్రాంతాలలో నల్లాలలో వచ్చే నీరు కలుషితమైనదని స్థానికులు చెపుతున్నా సంబంధిత అధికారుల చర్యలు అంతంత మాత్రమే. ఇప్పటికైనా పాతపైపులన్నీ మార్చవలసిన అవసరముంది. ట్యాంక్‌బండ్ శుద్ధి చేయడానికి జైకా నుంచి అప్పు తీసుకొని పనులు చేసినా ఫలితం లేకుండా పోయింది. కూకట్‌పల్లి నాలా, బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రసాయనాలతో కూడిన నీటిని ట్యాంక్‌బండులో నింపడంతో సమస్యకు పరిష్కారం దొరకడంలేదు. అలాగే కాటేదాన్ ప్రాంతంలో ఉన్న రసాయన ఫ్యాక్టరీలు, తమ వ్యర్థాలను మూసీనదిలో వదలడం వలన మూసీ కలుషితమై రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రజలపై అలాగే వారు వేసే పంటలపై ప్రభావం చూపుతుంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం మూసీనది ప్రక్షాళనల మరియు సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయం. అయితే మొదటగా ప్రక్షాళన యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. అప్పు తెచ్చి సుందరీకరణ అవసరం లేదు.
హైద్రాబాద్ నగరాన్ని వాయు మరియు జల కాలుష్యం నుంచి కాపాడుటకు ప్రభుత్వం సత్వరచర్యలు గైకొనాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వాన్ని కోరుతుంది.
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కమ్ముకున్న మేఘాలు
న్యాయవ్యవస్థ స్వతంత్రతని కాపాడే ప్రయత్నాలలో భాగంగా సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2015వ సంవత్సరంలో న్యాయమూర్తుల నియామకాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన సంస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో జాతీయస్థాయి నియామక కమీషన్ (ఎన్.జే.ఏ.సీ.- N.J.A.C) చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దుచేసి కొలీజియం వ్యవస్థనే కొనసాగించింది. ప్రభుత్వం న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నదని అందరూ అంటున్నారు. అలాగే న్యాయవ్యవస్థ ఆ ఒత్తిడికి లోనవుతుందన్న ఆందోళనలను కూడా చాలామంది వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళనలని సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ కూడా వ్యక్తం చేశారు. ఒక హైకోర్టు న్యాయమూర్తి బదిలీ ప్రభుత్వ అభ్యర్థనపై జరుగుతుందని సుప్రీంకోర్టు కొలీజియం స్వయంగా నమోదు చేసినప్పుడు అది న్యాయవ్యవస్థలో ప్రభుత్వం చేసిన తీవ్రమైన జోక్యంగా అందరికీ కనిపిస్తుందనీ జస్టిస్ భుయాన్ అన్నారు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి అతి పెద్ద ముప్పు లోపల నుంచి (అంటే న్యాయవ్యవస్థ నుంచి) వస్తుందని చాలామంది అంటున్నారని కూడా జస్టిస్ భుయాన్ అన్నారు. రాజకీయ ప్రభావం అన్న వ్యాధిని దృష్టిలో ఉంచుకుంటే కొలీజియం వ్యవస్థ కాలానుగుణంగా అత్యవసరంగా మారిపోయిందని కూడా ఆయన అన్నారు.
అసౌకర్యమైన తీర్పులే కారణమా ?
జస్టిస్ శ్రీధరన్ గతంలో ఇచ్చిన కొన్ని కీలక తీర్పులు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ఆయన జమ్మూ కాశ్మీర్ హైకోర్టులో ఉన్న సమయంలో పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద జారీ చేసిన అనేక నిర్భంధ ఉత్తర్వులను రద్దు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంలో ఆర్మీ అధికారి కల్నల్ సోఫియా ఖురేషిపై మంత్రి విజయ్‌షా చేసిన వ్యాఖ్యలపై ఎఫ్.ఐ.ఆర్ (F.I.R.) నమోదు చేయాలని ఆదేశించిన బెంచికి ఆయన నేతృత్వం వహించారు. ఇవన్నీ ప్రభుత్వానికి అసౌకర్యం కలిగించిన తీర్పులే. ప్రభుత్వం అభ్యర్థన మేరకు అతని బదిలీని మార్చినట్లు మాత్రమే కొలీజియం పేర్కొనడం వల్ల, న్యాయమూర్తుల బదిలీల వెనుక స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం వల్ల ఈ బదిలీ శిక్షాత్మకమన్న అభిప్రాయాన్ని బలపరుస్తుంది. ఈ బదిలీ ప్రభావం ఇతర న్యాయమూర్తులపై కూడా ఉంటుంది.
వ్యూ పాయింట్
భారత ప్రజాస్వామ్యానికి ప్రాణాధారం స్వతంత్రమైన న్యాయవ్యవస్థ. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలపై రాజ్యాంగ పరిమితులను విధిస్తూ పౌరుల హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థది. అలాంటి న్యాయవ్యవస్థపై సందేహాలు తలెత్తినప్పుడల్లా అవి కేవలం న్యాయవ్యవస్థకే కాదు. మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాద సంకేతాలుగా మారతాయి. సుప్రీంకోర్టు కొలీజియం చుట్టూ వెల్లువెత్తుతున్న పరిణామాలు ఆ ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదనీ, జవాబుదారీతనం లేదనీ అనేక విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కొలీజియం స్వతంత్రత గురించిన ఆందోళనలు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నుంచి రావడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. న్యాయమూర్తుల బదిలీల విషయంలో ప్రభుత్వ జోక్యం కొలీజియం సిఫార్సులోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ విషయాన్ని పేర్కొంటూ భుయాన్ ఆందోళన అందరినీ కలవరపెడుతోంది. న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి విశ్వాసం ఉన్న వ్యక్తులకి, అది స్వతంత్రంగా లేదని స్పష్టమై భయం కలుగజేస్తుంది. ‘స్వతంత్రతలో ఎంతో అస్వతంత్రత ఉందని’ స్పష్టమవుతుంది. ఈ బదిలీల సిఫారసులు కొలీజియం మీటింగ్‌లో తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో సర్క్యులేషన్ ద్వారా జరుగుతాయి. అప్పుడు జూనియర్ న్యాయమూర్తి నుంచి సీనియర్ న్యాయమూర్తుల వద్దకు ఫైల్ వెళ్ళాల్సి ఉంటుంది. కానీ, పై నుంచి కిందకు వస్తే స్వతంత్రంగా అభిప్రాయాలు వెలువరించే పరిస్థితి ఉండదు.
జస్టిస్ అతుల్ శ్రీధరన్ బదిలీ
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అతుల్ శ్రీధరన్‌ని మొదట చత్తీస్‌గఢ్ హైకోర్టుకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. అయితే , కేంద్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించి చివరకు ఆయనను అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేయమని కొలీజియం సిఫారసు చేసింది. అదేవిధంగా ఆయనకు బదిలీ అయింది. కొలీజియం ఈ విషయాన్ని తన సిఫారసులో ప్రత్యేకించి పేర్కొంది. ఈ మార్పుపై జస్టిస్ భుయాన్ బహిరంగంగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు పూర్తిగా కొలీజియం పరిధిలోని అంశమని అలాంటప్పుడు కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోవడం, కొలీజియం దాన్ని అంగీకరించడం అత్యంత ఆందోళనకరమని జస్టిస్ భుయాన్ హెచ్చరించారు. ఇది భవిష్యత్తులో ప్రభుత్వానికి నచ్చని తీర్పులను ఇచ్చే న్యాయమూర్తులను బదిలీ ద్వారా శిక్షించే సంప్రదాయానికి దారితీస్తుంది.
ఈ బదిలీ వల్ల జస్టిస్ అతుల్ శ్రీధరన్‌కి అసౌకర్యంతో పాటు నష్టం కూడా జరిగింది. ముందు ప్రతిపాదించినట్లు చత్తీస్‌గడ్ హైకోర్టుకి బదిలీ అయి వెళ్తే అక్కడ ఆయన కొలీజియం సభ్యుడయ్యే అవకాశం ఉండేది. కానీ, అలహాబాద్‌కి బదిలీ కావడం వల్ల ఆయన సీనియారిటీ జాబితాలో చాలా కిందకు వెళ్ళిపోయారు. సాధారణంగా పరిపాలన అవసరాల కోసం బదిలీ చేస్తున్నట్టు పేర్కొంటారు. ఈ బదిలీలో ఏ అవసరాలున్నాయోనన్న అనుమానాలు సహజంగానే తలుత్తుతాయి.
జస్టిస్ మురళీధర్ బదిలీ ఉదంతం
ఈ మధ్య జస్టిస్ మురళీధర్ సంపాదకత్వంలో ‘(ఇన్) కంప్లీట్ జస్టిస్’ సుప్రీంకోర్టు 75 అనే పుస్తకం వెలువడింది. ఆ పుస్తకంలో సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి మదన్ బి లోకూర్ వ్యాసంలో న్యాయవ్యవస్థ స్వతంత్రత గురించి ఎన్నో సందేహాలను లేవనెత్తారు. ఒక తీర్పుని వెలువరించినందుకు గాను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్‌ని బదిలీ చేయమని కొలీజియంకి అభ్యర్థన వచ్చిందని, తాను ఆ ప్రతి పాదనను ‘వ్యతిరేకించాను’ అని, తన అభిప్రాయాన్ని గౌరవించి అతని బదిలీని సిఫారసు చేయలేదని చెప్పారు. తాను పదవీ విరమణ చేసిన తరువాత ప్రభుత్వం ఈ బదిలీ గురించి మళ్ళీ ఒత్తిడి తెచ్చిందని, అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏ.కే. సిక్రే బదిలీ గురించి అభ్యంతరం వ్యక్తం చేయడం వల్ల అది విఫలం అయిందని, ఆయన పదవీ విరమణ తరువాత తీవ్ర వ్యతిరేకత లేకపోవడం వల్ల ఆయన బదిలీ జరిగిందని మదన్ లోకూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఏకపక్షంగా జస్టిస్ మురళీధర్‌ని బదిలీ చేశారని జస్టిస్ లోకూర్ తన వ్యాసంలో రాశారు. జస్టిస్ మురళీధర్ బదిలీ ఆ సమయంలో తీవ్రమైన ఆగ్రహాన్ని కలుగజేసింది. ఆ సంవత్సరం ఢిల్లీలో జరిగిన మత హింసాకాండలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులపై ఎఫ్.ఐ.ఆర్. (F.I.R) నమోదు చేయడంలో విఫలమైనందుకు, ఢిల్లీ పోలీసులపై ఆయన ఘాటుగా తీర్పు ఇచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సంఘటన క్రమాన్ని బట్టి ఈ బదిలీ శిక్షార్హమైనదన్న ఊహాగానాలు ఏర్పడ్డాయి. ఇది బహిరంగంగా మాట్లాడే స్వతంత్ర న్యాయమూర్తిని నిశ్శబ్ధం చేసే చర్య అని చాలామంది న్యాయవాదులు, సివిల్ సొసైటీ సభ్యులు విమర్శించారు.
ముందున్న దారి
కొలీజియం ఒక నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది, ఎందుకు మార్చిందన్న విషయాల్లో స్పష్టత అవసరం. కార్యనిర్వాహక ఒత్తిడి మేరకు బదిలీలకు సిఫారసు చేస్తే అది ప్రమాదకరమైన ధోరణి. ఇదే పరిస్థితి కొనసాగితే ధైర్యంగా, స్వతంత్రంగా తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు కరువు అవుతారు. కొలీజియం వ్యవస్థ సిద్ధాంత స్థాయిలో కాకుండా ఆచరణలో కూడా అదేవిధంగా ఉండాలి. లేనిపక్షంలో న్యాయమూర్తుల బదిలీలు న్యాయపరమైన ప్రక్రియ కాకుండా రాజకీయ నియంత్రణ సాధనంగా మారే ప్రమాదం ఉంది.
డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
ఓటుకు నోటు - జాతికి చేటు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా తమకు వచ్చిన నచ్చిన ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను ఎన్నుకోవచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే అటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపే అధికారం ఓటు హక్కు ద్వారా భారత ప్రజలకు లభించింది. మనదేశంలో ఎంతమంది ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిజాయితీగా ఓటు వేస్తున్నారు అన్నది మిలయన్ డాలర్ల ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల కంటే విద్యాధికులకు కూడా అధికంగా ఉన్న హైదరాబాదు వంటి నగరంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండడం బాధాకరం. ఓటు వేయడం అనేది హక్కు మాత్రమే కాదు గురుతర బాధ్యత కూడా అన్న విషయాన్ని ఓటర్లు విస్మరించరాదు. ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు ఇవ్వడం ఓటర్లకు ఏ ఇబ్బంది లేకుండా ఓటు వేయడం కోసమే కాని విశ్రాంతి తీసుకోవడానికి, పిక్నిక్‌లకు వెళ్ళడానికి కాదు. ఓటు హక్కు వినియోగించుకోకపోవడం వలన మన మంచి ప్రభుత్వాన్ని, అవకాశాన్ని కోల్పోతున్నాము. ఓటు వేయడం ఎంత అవసరమో సరియైన అభ్యర్థికి డబ్బు, మద్యం, కులం, మతం, ప్రాంతం అన్న ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా ఓటు వేయడం కూడా అంతే అవసరం. పార్టీల అభ్యర్థులు ఓటర్లను వశపరచుకోవడం కోసం వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. వీరు ఓటర్లను ప్రభావితం చేయడం కోసం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. మద్యాన్ని ఏరులాగా ప్రవహింపచేస్తున్నారు. డబ్బుకు, మద్యానికి ప్రలోభపడి ఓటు వేయడం వలన మనం ప్రజల కోసం నిజంగా పాటుపడే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకొనే అవకాశాన్ని కోల్పోతున్నాము. ఓటు వేసే విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని దుష్పరిణామం ఐదేళ్ళు ఉంటుంది. ఎన్నికల్లో విచ్ఛలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి గెలుపొందిన అభ్యర్థులు అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. బాధాకరమైన అంశం ఏమిటంటే పట్టభద్రులు టీచర్లు, ఎమ్మెల్సీల ఎన్నికల్లో కూడా విద్యాధికులు డబ్బు తీసుకొని ఓటు వేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈనాడు ఒక మధ్యతరగతి వ్యక్తి గాని బీద వ్యక్తి గానీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే అవకాశమే లేదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. శాసనసభ పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చుపై చట్టపరమైన నియమనిబంధనలు ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పాటించడం లేదు. ఎన్నికల కమీషన్ కూడా పరిమితికి మించి ఎన్నికల్లో ఖర్చు చేస్తున్న అభ్యర్థులపై చర్యలు గైకొన్న దాఖలాలు లేవు. ఎన్నికల్లో మితిమీరిన ధన ప్రభావం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరం.
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు :
చట్టసభలకు ఎన్నిక కావాలనుకునే అభ్యర్థులు ఇతరులకు ఆదర్శప్రాయులుగా ఉండాలి. నేర చరిత్ర ఉండరాదు. దురదృష్టవశాత్తు ఈనాడు అన్ని రాజకీయ పార్టీలు నేర చరితులకు సీట్లను కేటాయిస్తున్నారు. అశ్వినీకుమార్ ఉపాధ్యాయ, నేరచరిత కలిగిన ప్రజాప్రతినిధుల అంశంపై సుప్రీమ్ కోర్టులో పిల్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించిన సమాచారం ప్రకారం మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన 2556 మంది వివిధ రకాలైన క్రిమినల్ కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మన పార్లమెంటు సభ్యులను , శాసనసభ్యులను కలుపుకుంటే ఈ సంఖ్య 4422 . అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రచురించిన సమాచారం ప్రకారం 2024లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన 543 మంది అభ్యర్థులలో 250 (46%) మందిపై క్రిమినల్ కేసులకు సంబంధించిన అభియోగాలు ఉన్నాయి. ఇందులో అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఓటరు మహాశయులు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నైతికత కలిగిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి.
రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమీషన్ :
మనదేశంలో ఎన్నికలను నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం భారత ఎన్నికల కమీషన్ ను జనవరి 25 1950న ఏర్పాటు చేశారు . ఏకసభ్య కమీషన్ గా ఉన్న ఎన్నికల కమీషన్ ను 1993 నుండి త్రిసభ్య కమీషన్ గా మార్చడం, ప్రధాన ఎన్నికల కమీషనర్ అధికారాలను తగ్గించడం కోసం ఈ చర్య గైకొన్నారన్న విమర్శ ఉంది. ప్రధాన ఎన్నికల కమీషనర్ గా టి.ఎన్. శేషన్ ఎన్నికల సందర్భంగా తీసుకున్న చర్యలను అందరూ హర్షించారు. ప్రస్థుతం అమలులో ఉన్న విధానం ప్రకారం ప్రధాన ఎన్నికల కమీషనర్ ను, ఇద్దరు ఎన్నికల కమీషనర్లను ఎంపిక చేసే కమిటీకి ప్రధానమంత్రి నాయకుడు కాగా లోక్‌సభ ప్రతిపక్ష నేత కేంద్రప్రభుత్వం చేత నామినేట్ చేయబడ్డ ఒక మంత్రి సభ్యులుగా ఉంటారు. ఈ కారణం చేత ప్రభుత్వం కావాలనుకున్న వారే ఈ పదవులకు ఎంపిక అవుతారు. భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎన్నికల కమీషనర్ లోను కమీషనర్లను ఎంపికను పారదర్శకంగా చేయడం కోసం ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తికి స్థానం కల్పించాలి. ఎక్కువమంది యువజనులకు ఓటింగ్ హక్కు కల్పించాలన్న ఉద్ధేశ్యంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989వ సంవత్సరంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటర్లను వయో పరిమితిని 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాల వయసుకు తగ్గించారు.
2011 నుండి అమలులోకి వచ్చిన జాతీయ ఓటర్ల దినోత్సవం :
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2011 నుండి జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్ణయించింది. ఈ సందర్భంగా భారత ఎన్నికల కమీషన్ 18 సంవత్సరాలు నిండిన వయోజనులను ఓటర్లుగా నమోదు చేసుకొని వారికి ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తుంది. రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం అవసరానికనుగుణంగా ఎప్పటికప్పడు ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది. ఎన్నికల కమీషన్ చర్యలో భాగంగా ఎన్నికల కమీషన్ స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ (SIR) చేపట్టి అనర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియ ప్రారంభించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. అర్హత కలిగిన ఏ ఓటరు పేరు ఓటర్ల జాబితా నుండి తొలగించరాదు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రతి ఓటరు ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా సశ్చీరులకు ఓటు వేద్దామని ప్రతిజ్క్ష చేయాలని కోరుకుందాం.
డాక్టర్ పి. మోహన్‌రావు
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు
పేరే మారింది.. సాప్ట్‌వేర్ అదే..సమస్యలు అవే !
భూమి రైతుకు జీవనాధారం. ఆ భూమి హక్కులే ప్రశ్నార్థకంగా మారితే రైతు జీవితం అస్తవ్యస్తమవుతుంది. తెలంగాణలో భూసంస్కరణల పేరుతో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ మంచి ఉద్ధేశ్యాలతో ప్రారంభమైనప్పటికీ, అమల్లో తీవ్ర వైఫల్యానికి లోనై రైతులను నిస్సహాయ స్థితికి నెట్టింది. ధరణి స్థానంలో భూ భారతి వచ్చినా, సమస్యల పరిష్కారం మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉంది. పేర్లు మారాయి, రంగులు మారాయి.. కానీ రైతు బాధ మాత్రం మారలేదు.
ధరణిని భూ భారతిగా మార్చినప్పటికీ మౌలిక సమస్యలు అలాగే ఉన్నాయి. ధరణి ద్వారా ఏర్పడిన భూ సమస్యలు ఇప్పటికీ భూ భారతి ద్వారా పరిష్కారం కాలేదు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు.
రైతులకు మేలు చేయాలని….
బి.ఆర్.ఎస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే మంచి ఉద్ధేశ్యంతో ధరణి వ్యవస్థను ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూమి హక్కులు (టైటిల్) రెవెన్యూ రికార్డుల్లోకి బదిలీ చేయాలనే లక్ష్యంతో, సాఫీగా, సమయానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేందుకు స్లాట్ బుకింగ్, తేదీ ఖరారు వంటి విధానాలు ప్రవేశపెట్టింది. కానీ అమల్లో ఘోరవైఫల్యం ఎదురైంది. దీని ఫలితంగా అనేక సమస్యలు తలెత్తాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరికి ఆధార్ కార్డుల్లో తప్పులు పడ్డాయి. మరికొందరికి పాస్ పుస్తకాల్లో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. ఆధార్‌లో తప్పులను సరిచేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, భూమికి సంబంధించిన పాస్‌బుక్‌లో పడ్డ తప్పులను సరిచేయడం మాత్రం కష్టసాధ్యంగా మారింది. కొన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో పడిపోయి, అవసరానికి భూమిని అమ్ముకోలేని పరిస్థితి నెలకొంది. ఒకసారి నిషేధిత జాబితాలో పడిన భూములు ఇప్పటికీ బ్లాక్‌లోనే ఉండిపోయాయి.
సమస్యలు పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చి….
ఈ ధరణి వైఫల్యమే ప్రధాన కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే గతంలో కలెక్టర్ చేతిలో మాత్రమే ఉన్న అధికారాన్ని ఇప్పుడు తహశీల్దారు, ఆర్డీఓలకు కూడా విస్తరించారు. అయినా వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఆ తప్పులను సరిదిద్దడానికి ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసి చేసి, ఎటూ తేలక ఆశలు వదులుకునే స్థితికి రైతులు చేరుకున్నారు. మా ఊర్లో నిస్సహాయులైన ఒక వృద్ధ దంపతులు తహశీల్దారు కార్యాలయం ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన దీనికి నిదర్శనం. ఓ పౌరుడు ఓపిక నశించి తహశీల్దారుపై కిరోసిన్ పోసి కాలబెట్టిన ఉదంతం కూడా అందరికీ తెలిసిందే. ఒక తహశీల్దారు బదిలీ అయ్యే రాత్రే దొంగ ప్రొసీడింగ్స్ , పాత తేదీలతో నోటీసులు సృష్టించి, అక్రమంగా మ్యుటేషన్లు చేసి పాస్‌బుక్స్‌పై సంతకాలు పెట్టి లక్షల్లో దండుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక లంచం ఇవ్వని రైతుల భూములు ఆక్రమణదారుల పేర్లకు మార్చి, వారి నుంచి లంచాలు తీసుకున్న ఉదంతాలు ఎన్నో. ఇలాంటి సంఘటనలు దాదాపు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నాయి.
సాప్ట్‌వేర్ సరిచేయాల్సిందే….
కాంగ్రెస్ ప్రభుత్వం భూ యజమానులందరికీ భూ సర్వే చేస్తామని ప్రకటించడం మంచి నిర్ణయమే. దాని ద్వారా కనీసం 70% సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ రెండేళ్ళు గడిచినా ఆ హామీ అమల్లోకి రాలేదు. ప్రభుత్వం, తలుచుకుంటే భూ సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించగలదు కదా ? ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన చలాన్ స్కామ్ ద్వారా వ్యవస్థలో అవినీతి ఇంకా కొనసాగుతోందని స్పష్టమైంది. డేటాను తారుమారు చేయగల లోపాలు ఉన్నాయని ఋజువైంది. వాటిని తక్షణమే సాప్ట్‌వేర్ మార్పుల ద్వారా సరిచేయాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలో నిజమైన మార్పు రాలేదు. మ్యుటేషన్లకు లంచాలు, కార్యాలయాల చుట్టూ రైతులు తిరగడాలు యథావిధిగా కొనసాగుతుండటంతో సమయానికి వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. పైగా అవసరాలకు భూమిని అమ్ముకోలేక, కాలానుగుణంగా దున్నుకోలేక రైతు నిరాశతో కూరుకుపోతున్నాడు. ఇంకెన్నాళ్ళు రైతులకు ఈ తండ్లాట ?
ప్రజల నమ్మకం కోల్పోతే…
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత సొమ్ము, ఎంత భూమి కూడబెట్టుకోవాలన్న లెక్కల కంటే, ప్రజల మెప్పు పొందేలా పాలన సాగించడమే ముఖ్యం. ప్రజల నమ్మకం కోల్పోతే ఏ రంగు పాస్‌బుక్, ఏ కొత్త పేరు కూడా ప్రభుత్వాన్ని కాపాడలేవు. నాయకులు ప్రజల సేవకులుగా ఉండాలి. వారు ప్రవేశపెట్టే ప్రతి పథకం వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజల కోసం ఉండాలి. లేదంటే ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వరు. ఆ పరిస్థితి రాకముందే, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.
సయ్యద్ రఫీ
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు
Readers Write
I read the English articles in FGG Times – Jan. 2026 issue.
- Excellent, meaningful and deeply public-spirited articles by Prof Ram Mohan Rao and the former district Judge.
- Reg. the anti-defection reforms, it is important to consolidate the initiative towards filing a PIL in at least the HC. Two suggested reforms are clearly viable; one, time-frame for clearing anti-defection complaints along with a complementary provision for providing detailed justification in case of failure to adjudge the complaints in the prescribed time-frame; two, providing detailed justification for resignations. Regarding the suggested penal reforms, there are two vital issues – one is the neutrality of the Speaker; and secondly, defections are unethical but political rather than criminal and if in case they are criminal, there are provisions for barring the candidate.
- Regarding the reach of the important content in the magazine, I think critical snippets of the content should be transformed into short reels, etc. because most individuals of today’s generation have no patience to read but invest much of their time in social media. There’s worthiness of content but also shortcomings in its dissemination strategies.
- Reg. the presentation of the content, the titles should not be in light grey but in bold dark. The title of the anti-defection is so light that it doesn’t even appear as a title.
- Download option for the magazine is imp; because serious readers prefer to underline the content, make remarks, etc. Now, saving the document as PDF isn’t really convenient because it needs to be done in landscape and A3 size. It is better if the presentation is done in A4.
- There is a need for an INDEX on the first page – this is v v imp because any reader would want to first have an overview and also choose the articles that are worthy of reading.
- Regarding the presentation, the sequence of is a bit ambiguous. While one reads the magazine, it appears unclear whether after the page ends, is the continuation in the sideward page or whether one should scroll down.
I’m thankful to FORUM FOR GOOD GOVERNANCE for all its efforts towards serving the public interest, Sir…… 🙏🏽
Sharat Chandra,
Institute of Inclusive Governance.
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of JANUARY 2026
- To the Chief Minister, regarding Monkeys damage to crops and houses, attack on human beings. Request to take suitable action to prevent problems from monkeys – on 19-1-2026
- To the Chief Minister, regarding revisit Gruha Jyothi and fix up eligibility criteria. Poor who need Government help only to be given Gruha Jyothi – on 21-1-2026
- To the Prl. Secretary, Environment, Forest, Science & Technology department regarding Request for ban on production of Single Use Plastics in Telangana – on 21-1-2026
- To the Commissioner, Prohibition & Excise department regarding request for closure of belt shops – on 23-1-2026
- To the Chief Secretary regarding to issue suitable instructions to Prl. Secretaries in Secretariat that permission for prosecution to be issued within one month of receipt of inquiry report from D.G. A.C.B – on 23-1-2026
- To the Chief Secretary regarding artificial ripening of Mangoes by using banned chemicals. Request for strict control on sale of artificially riped Mangoes in fruit markets – on 27-1-2026
- To the Chief Secretary regarding Serious irregularities in transfers and Postings in GHMC Request for inquiry – on 27-1-2026
FGG TIMES
Forum For Good Governance
H.No.6-1-69, Flat No.204,
G.K.R. Mansion Saifabad,
Lakdikapool, Hyderabad,
Pin : 500004
Phone: 040 2323 0334
Editorial Board:
M. Padmanabha Reddy I.F.S.(R) (President)
Soma Srinivas Reddy B.E (Secretary)
Interested may send articles/ letters/ News to
E-mail: timesfgg@gmail.com