FGG TIMES
సుపరిపాలనే ధ్యేయంగా
Editor: T. Vivek, Associate Editor: Prof. Raghuram Rao Akkinepally
Vol. No. I | Issue No. 8 | Monthly News Letter | August 2025
IN FOCUS
అవినీతి -బ్రహ్మ రాక్షసే.
అవును, అవినీతి బ్రహ్మరాక్షసే. రాయటానికి నాలుగు అక్షరాల మాటే కానీ దాన్ని నిర్వచించాలంటే ఎన్ని మాటలూ సరిపోవు. సుమారుగా అన్ని చెడు పనుల మూలల్లో అవినీతే ముఖ్య కారణంగా కనబడుతుంది, కొంతమందేమో చురుగ్గా పాల్గొంటారు, మరికొంతమందేమో అంటీముట్టనట్లుగా. అవినీతి రూపురేఖలూ పరిపరి విధాలుగా ఉంటాయి. ఏదీ ఏమైనా
బ్రహ్మరాక్షసి కాబట్టే ఎన్నో వందల, వేల ఏళ్లనుండి మనని అన్ని రంగాల్లో విజయం సాధించకుండా పీడిస్తోంది. కొంత ఎక్కువగానో, లేక కొంత తక్కువగానైనా అవినీతి లేని సమాజమూ లేదు, దేశామూ లేదనే విషయం అందరికీ తెలిసినదే. దాని మూలలు వెతకాలంటే మనిషి పుట్టుక దాకా వెళ్లాలేమోకూడా. ఏదైనా జబ్బొస్తే స్వయంగా బాధ పడతాం. కోలుకుంటాం, లేకుంటే ఎగిరిపోతాం. కానీ ఇదెక్కడి అంటువ్యాధి? ప్లేగు, కోవిడ్ల కంటే భయంకరంగా మానవ సమాజాన్ని నిరంతరం పట్టి పీడిస్తోనేవుంది. నిర్వీర్యం చేస్తోంది. క్యాన్సర్కే మందులోచ్చాయంటున్నారు, దీనికి అంతమే లేదా?
మాములుగా, మనిషికి, జంతువుకు తారతమ్యం ఏమిటంటే భావప్రకటనా సామర్థ్యం అంటారు. ఇంకో కోణంలో చూస్తే, ఎన్ని యుగాలైనా జంతువులేప్పుడూ (చి న్న క్రిమినుండి పెద్ద జంతువు వరకూ) ఆహార సముపార్జనకు శ్రమపడటం, కొంత సేద తీరి మళ్ళీ అదే పనిలో పడటం. ఏమీ మార్పు లేదు, ఉండదు. కానీ ఉత్కృష్ఠుడని చెప్పబడుతున్న ఈ మనిషి మాత్రం జంతువులనుండి వేరుగా గుర్తింపబడేది నిజానికి ఇక్కడే. తనూ, తన సంబoధీ కులనుకునేవాళ్ళూ తొందర తొందరగా ఆస్తులూ అంతస్థులూ మూటగట్టుకొని, శ్రమపడకుండా నిరంతరం సుఖజీవన రాగం పాడుకుంటూ జీవించాలనే అత్యాశతో(కంఫర్ట్ జోన్లో ఉండాలని) అవినీతి వైపు మళ్లుతున్నాడు. ఆ ప్రయత్నంలో తన దురాలోచన ఎటు దారితీస్తోందో గ్రహించక/పట్టించుకోక కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. అవినీతి పుట్టిందీ ఆ అత్యాశ నుండే. అన్ని జాడ్యాలకీ మందులు కనుక్కుంటున్నా, ఆకాశానికి నిచ్చనలువేస్తున్నా, అభివృద్ధి నా కనుసైగల్తో జరుగుతొందని ఢoకా కొట్టుకొనే మనిషి ఈ అవినీతి జాడ్యాన్నoదుకే పెంచి పోషిస్తున్నాడు. సర్వాoతర్యామి అని చెప్పబడే భగవంతుడేమోగానీ, అవినీతి మాత్రం ఎందెందు వెదికిన, అందందే కలదoటంలో ఏ సందేహం వలదు. ఒక పక్క అభివృద్ధి జరుగుచున్నా, మనం ఎక్కడవేసిన గొంగళి అక్కడే రీతిన ఉన్నామన్నా, శ్లేష్మలో పడ్డ ఈగలా కొట్టుకుంటూ ఉన్నామన్నా అవినీతే ముఖ్య కారణం. సర్వరోగనివారుణులు అనబడేవి ఎంత పని చేస్తాయోగాని, అవినీతి మాత్రం సర్వ అనర్థాలకు మూలకారణమే. బయటకు భీకరంగా కనబడే ప్రయత్నం ఎంత చేసినా ఎంతమంది అవినీతిపరులు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా వున్నారనేది అనుమానాస్పదమే. వాళ్ళే కాదు, వాళ్ళ సంబంధీకులూ భయపడుతూనే వుంటారు. కానీ, ఎందుకు వదిలిపెట్టరంటే ఒక్కటే కారణం, అవినీతీ ఒక భయకరమైన వ్యసనమవటమే. “మీలో నేరం చేయనివారే ముందుగా రాయి విసరాలి” అనగానే సినిమాలో లాగా ఎవరికివారు నిజ జీవితంలోనూ అందరూ తమని తప్పుపట్టక ఊరుకుంటారనే ఒక పిచ్చి భ్రమలో వుంటారు. కానీ అన్ని రోజులూ మనవికావుగదా!
మరి, అవినీతి ఇంత ప్రమాదకరమైన జాడ్యo అయితే మనం ఎన్నోరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించామన్నది కల్లిబొల్లి మాట, మసీపూసిన మారేడుకా యేనా? కాక, అది నిజంగా అత్యంత ప్రమాదకారే, ప్రగతి నిరోధక శక్తే, దాన్ని సమూలంగా మట్టుబెట్టకపోతే సర్వనాశనమే. ఈ రెంటిలో ఏదీ నిజం అనేదే నేడు మన ముందున్న అతి ముఖ్య ప్రశ్న. ఒక్క మాటలో చెప్పాలంటే
రెండూ నిజాలే. ఎప్పుడూ అన్నిటినీ అoదరికీ ఆపాదించకూడదు. మానవ ప్రగతిని కాంక్షించేవారు, దానికి నిర్వీరామ కృషి చేసే వారూ ఎప్పుడూ వుంటారు. కానీ వారు కూడా వాళ్ళ ధోరణిలో వాళ్ళేవుంటే ఎలా? వాళ్ళచుట్టూనే ప్రగతి నిరోధకులూ, అవకాశావాదులూ, అసాంఘిక శక్తులూ తిష్ట వేసుకునే వుంటారు. కంచే చేను మేసినట్లుగా అవినీతిని అరికట్టటానికి నియమించబడ్డవాళ్ళలోనే అవినీతిని ప్రోత్సహించేవాళ్ళూ ఉంటారు. ప్రతి క్షణం అంతర్గత భావొద్వేగాలను గమనించి సరిఅయిన చర్యలు తీసుకుంటూనే ఉండాలి. రైతులు కష్టపడి పండించేది పంటలు వరదలపాలు చేయటానికి కాదు. ప్రభుత్వంవారు బ్రిడ్జీలు, డ్యాములు కట్టేది, రైళ్ళు నడిపేది బాoబులు పెట్టి కూలగొట్టటానికి కాదుగదా? మన దేశంలో అధిక జనాభా, నిరుద్యోగం కారణాన దారిద్ర్యం విలయ తాండవం చేస్తూనే వుంది. దాన్ని అరికట్టకుంటే ఎంత ప్రగతి సాధించిన వృధానే. అయినా, దేశ వైశాల్యం, భౌగోళిక పరిస్థితులకు తగ్గట్లు ఇంత అటవీ సంపద ఉండాలన్నట్లుగానే జనాభా, జన సాoద్రతా దేశానిబట్టే ఉండాలిగా? ఆ సమతుల్యత లోపించినప్పుడు సహజంగానే దేశ సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారముండకపోవటమేకాక నైతిక విలువలు పడిపోయి అవినీతే రాజ్యమేలుతోo ది.
ఎప్పటికైనా ఒక్కటే జవాబు, మన ప్రభుత్వాలు, ప్రచారసాధనాలూ అవినీతి దుష్ఫలితాలు, పాల్బడేవారిపై తీసుకునే కఠిన చర్యలపై విస్తృత ప్రచారం చేయటం, కోర్టుల్లో తత్సంబంధ కేసులు అత్యంత వేగంగా పరిష్కరించటం జరిగితే ఎంతో అవినీతి తగ్గే అవకాశముంది. కోవిడ్ అయినా ఒకటే, అవినీతి అయినా ఒకటే. ప్రజను తీవ్రంగా హెచ్చరించాల్సినప్పుడు కూడా అలసత్వం చూపితే ఇక ప్రభుత్వాలెందుకు, పాలనకు అర్థమేముంది? ఎన్నో దేశాలు దీక్షపూని అవినీతిని నిర్మూలించబట్టే, వైశాల్యంలో చిన్నవైనా అభివృద్ధిచెందిన దేశాలుగా గుర్తింపుపోందాయి.
ప్రజలుగా మనమందరమూ చేయాల్సిన మొట్ట మొదటి పని, మనను అన్ని రకాలుగా నిర్వీర్యులను చేస్తున్న అవినీతిని కనీసం అసహ్యించుకుందాం. తాత్కాలిక లాభాలకై మనని దారుణంగా దిగజారుస్తున్న అనైతిక వ్యామోహాలకు, ప్రలోభాలకూ అతీతులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. జరిగేదికాదు, అన్నీ నడుస్తయి, మడిగట్టుకొని కూర్చుంటే కూడు గూడు కాదు, నీళ్ళకూ కరువే అనే శుష్కవాదాలనను పరిత్యజించుదాం. పశు పక్షాదులకైనా, మానవ జాతికైనా శ్రమైకజీవనమే ఎల్లవేళలా ఆనందదాయకం అనే మూల సూత్రాన్ని గ్రహించి ఫలితం కంటే ప్రయత్నాన్ని ఆస్వాదిద్దాం. మనమెప్పటికీ ఇంటిపోషణలో ఎగరటం మర్చిపోయిన రామచిలుక కావద్దు. కొంచెం నిషితంగా పరిశీలిస్తే ఇప్పటికీ, ఎప్పటికీ అవినీతికి పాల్పడకుండా తోటివారికి సహాయంగావుండేవారికి సమాజంలో ఎనలేని గౌరవo ఇవ్వటం చూస్తోనేవుంటాం. అదే, ఏదైనా సందర్భంలో మన అవినీతి బయల్పడితే మనతోబాటు దాంట్లో పాలుపంచుకున్నవాళ్లు, సంబంధలేనివాళ్ళు బలి అవుతారుగా. కనీసం ఆ భయానికైనా మన కుటుంబీకులైనా, సంబంధీకులెవరైనా అవినీతివైపు మొగ్గితే వారు దాంట్లోంచి బయటపడేదాకా వదిలిపెట్టొద్దు. ఎన్నో అరాచకాలు చేసి కట్టుకున్న మూటలు క్షళ్ళముందే ఎగిరిపోతుంటే, గుండెలు పగిలి అవమాన భారంతో క్రుంగిపోతున్న ఎన్నో కుటుంబాలను నిత్యం చూస్తోకూడా నాకెందుకులే/ నేనైతే ఇరుక్కొను అనుకుంటే ఎలా?వాల్మీకి అనే బోయవాడు మహర్షి అయ్యాడన్నా ఇంట్లోవాళ్ళ ప్రతిఘటనే గదా కారణo. అవినీతి కారుచిచ్చులా సర్వ వ్యవస్థలనూ దహహిస్తుoటే, ప్రజలూ మిగలరు, పాలకులూ మిగలరు. ఒక్కసారి ఆశాoతి, అరాచకత్వం ప్రబలాయంటే సర్వo నాశనమే.
మంచి మార్పూ ఒక విప్లవం లాంటిదే. ఒక్కసారి ప్రబలిందంటే ఆగదు. మనం చేయాల్సిందల్లా సమిధనోక్కటి అహుతివ్వడమే. గాంధీ మహాత్ముడు కలలుగన్న అవినీతిరహిత భారతాన్ని చూడడానికి సిద్ధంగా ఉందాం.
జి. శ్యామ్ ప్రసాద్
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మెంబర్
ఏవి ఉచితాలు - ఏవి అనుచితాలు ?
ఉచితాలు అనేవి తరచూ చర్చనీయాంశాలు అవుతున్నాయి. స్కాలర్‌షిప్‌లు కూడ ఉచితాలు లాంటివే. యూనివర్సిటీ విద్యార్థులకు గతంలో స్కాలర్‌షిప్‌లు ప్రభుత్వాలు ఇస్తుండేవి. కులాలతో సంబంధం లేకుండా వీటిని ప్రభుత్వాలు ఇస్తుండేవి. ఇప్పుడు కూడ ఇస్తున్నాయేమో నాకు తెలియదు. ఆ స్కాలర్‌షిప్‌ల వల్ల చాలామంది యూనివర్సిటీ విద్యను అభ్యసించారు. అలా చదువుకున్న విద్యార్థులు చాలామంది జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. న్యాయమూర్తులయ్యారు. సివిల్ సర్వీసులలో సెలెక్ట్ అయ్యారు. ఈ ఉచితాలు అనేవి చర్చనీయాంశాలే. ఈ ఉచితాలు అనేక రూపాలలో ఉన్నాయి. అనేక పేర్లతో ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలుగా మారపోతున్నాయి. అందులో రాజకీయ వ్యూహాలు కూడ ఉన్నాయి. ఈ ఉచితాల అంశం సుప్రీమ్ కోర్టు ముందుకు , హైకోర్టు ముందుకు తరచుగా వస్తున్నాయి.
వ్యూ పాయింట్ :
గత ఫిబ్రవరిలో పట్టణ నిరాశ్రయులకు షెల్టర్ పథకం అమలుకి సంబంధించిన రిట్ పిటీషన్ విచారిస్తున్న అప్పటి సుప్రీమ్‌కోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నిరాశ్రయులైన ప్రజలను “పరాన్నజీవులుగా” అభివర్ణించారు. ప్రజలకు ఆహార ధాన్యాలిచ్చి వాళ్ళను పరాన్నజీవులుగా మార్చడం లేదా ? అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల మీద దేశ వ్యాప్త చర్చ జరిగింది. 300 మంది యాక్టివిస్టులు, న్యాయవాదులు, జర్నలిస్టులు కలిసి ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖను రాసారు.
ద్రవ్యలోటు :
ఈ ఉచితాల వల్ల ఏర్పడే ద్రవ్యలోటు గురించి రిజర్వ్ బ్యాంకు హెచ్చరికలు చేసింది. ఎన్నికల్లో లబ్థి కోసం పార్టీ అన్ని రాజకీయపక్షాలు ఉచితాలను అనుచితంగా ప్రకటించి ఇబ్బందుల పాలవుతున్నాయి. సంక్షేమరాజకీయాలు చట్ట బద్ధమైనవే. అయితే సంక్షేమచర్యలు, అనారోగ్యకరమైన ఉచితాల మధ్య సన్నని రేఖ ఉంది. 40 సంవత్సరాలు ప్రభుత్వాలకు సేవలందించిన ఓ రిటైర్డ్ ఇంజనీరు ఏ. నరేందర్ రెడ్డి తాను పదవీ విరమణ చేసిన తరువాత రావాల్సిన ప్రయోజనాలు తనకు రాలేదని ఆయన తెలంగాణ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ విచారిస్తూ జస్టిస్ నగేష్ బీమపాక ఇలా అన్నారు. ఆర్థిక విషయాలు, సంక్షేమపథకాలు శాసనసభ విధానం క్రిందకు వస్తాయని అవి న్యాయసమీక్ష వెలుపలి అంశాలు అని అంటూనే ఇటువంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైనదని కోర్టు పేర్కొంది. ఉచిత విద్యుత్తు, నీరు, ప్రజారవాణా, వ్యవసాయ ఋణ మాఫీ వంటి వాటికి నిధులు కేటాయిస్తూ దీర్ఘకాలంగా సేవలను అందించిన ఉద్యోగులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలలో న్యాయబద్ధత ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన లేకుండా ప్రభుత్వ ఉచితాల పంపిణీ పెరుగుతుండడంపై హైకోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తపరిచింది.
రాష్ట్ర అతిధి సౌకర్యం :
ఈ పెరుగుతున్న ఉచితాల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాని, ఎలాంటి న్యాయమైన ముగింపు లభించడం లేదు. ఉచిలాలు అవసరమే అని ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే విధంగా ఉండకూడదని చాలామంది భావన. అయితే, ఒక్క విషయాన్ని ఉచితాలను విమర్శించే వ్యక్తులు గమనించాలి. కనిపించే ఉచితాలు కొన్ని ఉంటాయి. కనిపించని ఉచితాలు, చర్చకు రాని ఉచితాలు మరెన్నో ఉంటాయి. అలాంటి ఉచితాలు లాంటి ఓ విషయం ఈ మధ్య నా దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనరల్ ఏ.పి. ప్రభుత్వానికి గత సంవత్సరం మే నెలలో ఒక లేఖను రాసారు. ఆ లేఖ సారాంశం ఏమిటంటే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర అతిధి మర్యాదలను, సౌకర్యాలను ప్రధాన న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు పరస్పర (రెసిప్రోకల్) ప్రాతిపదికన విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించినప్పుడు ‘రాష్ట్ర అతిధి’ సౌకర్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ జి.ఓ.ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ. ఎం.ఎస్.నం. 1 తేది 1-1-2025 రోజున జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం 2024న ఇలాంటి జి.ఓ. ఇచ్చిందన్న విషయం కూడ ఈ జి.ఓ. ద్వార గోచరమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యాయమూర్తుల అధికారిక సందర్శనలకే కాదు, అనధికార సందర్శన సమయంలో కూడ వాళ్ళను రాష్ట్ర అతిధులుగా పరిగణిస్తారు. అనధికార సందర్శన సమయంలో ఈ సౌకర్యాలు ఇవ్వడం ఏవిధంగా సమంజసమో ఎవరికీ అర్థం కాని విషయం. ఇది ప్రభుత్వం న్యాయమూర్తులకు ఇస్తున్న ఉచితాలుగా భావించే అవకాశం ఉందికదా.
పదవీ విరమణ చేసిన వారికి ఉచితాలు వద్దు ః
మరో ముఖ్య విషయం ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులు ఎక్కువగా తెలంగాణని సందర్శించే అవకాశం ఉంది. దీనివలన తెలంగాణ ప్రభుత్వం మీద అధిక భారం పడే అవకాశం ఉంది. నిజంగానే అవసరమని ప్రభుత్వాలు భావిస్తే ఏ రాష్ట్ర న్యాయమూర్తులకు ఆ రాష్ట్రమే ఖర్చులని భరిస్తే మంచిది. అనధికార సందర్శన సమయంలో స్టేట్ గెస్ట్ సౌకర్యాలు ఇవ్వడం ఎంత మాత్రం సమంజసంగా అనిపించడం లేదు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు మరియు ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులకు ఈ సౌకర్యాలు ఇవ్వడం ప్రజల డబ్బును అనవసర ఖర్చులకు వాడుతున్నట్లుగా అనిపిస్తున్నది. ప్రజలకు ఇచ్చే ఉచితాలు దిగువ శ్రేణి ప్రజలను కొంత పైకి తీసుకుని రావడానికి ఉపయోగపడాలి. అంతే గాని పైనున్న వ్యక్తులను పైకి తీసుకుపోవడానికి కాదు. ఉచితాల వలన ప్రజల జీవితంలో మెరుగైన అవకాశాలు ఏర్పడాలి. అది అవసరమున్న ప్రజలకే ఆ ఉచితాలు అందాలి. ఏమైనా ఉచితాల గురించి మాట్లాడుతున్న వ్యక్తులు తమకు లభిస్తున్న ఉచితాల గురించి ఆలోచించాలి.
అనధికార సందర్శన :
మనదేశంలో ప్రభుత్వాలు పెద్ద లిటిగెంటు. చాలా కేసుల్లో (స్టేట్) రాజ్యం అనేది వాది గానో, ప్రతివాది గానో ఉంటుంది. ఇలాంటి రాజ్యం నుంచి ‘అనధికార సందర్శన’ సమయంలో ‘స్టేట్ గెస్ట్’ సౌకర్యాలు పొందడం ఎంతవరకు సమంజసం ? ఇది న్యాయమూర్తులు ఆలోచించుకోవాల్సిన అంశం. ఇలాంటి స్టేట్ గెస్ట్ సౌకర్యాలు గతంలో లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత వచ్చిన సౌకర్యాలు. సౌకర్యాల వెనుక ప్రభుత్వాల ఉద్ధేశ్యాలు ఏమిటో అర్థం కాని విషయం. ఉచితాల గురించి తరచూ మాట్లాడుతున్న కోర్టులు వీటి గురించి కూడ మాట్లాడితే బాగుంటుందేమో
డాక్టర్ మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)
ప్రభుత్వ ఆశీస్సులతోనే కల్తీ కల్లు దందా
తెలంగాణలో ఆది నుంచి కల్లు త్రాగుట అలవాటుగా ఉంది. పెద్ద ఎత్తున తాటి మరియు ఈత చెట్లు ఉండడంతో కావలసినంత స్వచ్ఛమైన కట్లు దొరికేది. వ్యవసాయ విస్తరీకరణతో చాలామటుకు ఈత, తాటి చెట్లు నరకబడి కల్లు లభ్యత తగ్గిపోయింది. మరకవైపు జనాభా పెరుగుదలతో తాగే వారి సంఖ్య పెరగడంతో స్వచ్ఛమైన కల్లు స్థానానే కల్తీ కల్లుకు బీజం పడింది. దీనికి తోడు హైదరాబాదు నగరంలో పెద్ద ఎత్తున కల్లుకు గిరాకీ ఉండడంతో అనంతపురం వంటి దూరప్రాంతాల నుంచి కల్లు రవాణ అయినా సరిపోలేక పెద్ద ఎత్తున కల్తీ కల్లు దందా మొదలైంది.
ఆబ్కారీ తాడి పాలసి 2004 ప్రకారం 50 కి.మీ. వ్యవధిలో తాటి, ఈత చెట్లు ఉన్న ప్రాంతంలోనే కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వాలి. ఈ పాలసీ ప్రకారము హైదరాబాదు నగరంలో చుట్టుపక్కల 50 కి.మీ. లోపు తాటి, ఈత చెట్లు లేనందున 2004వ సంవత్సరంలో హైదరాబాదు నగరంలో కల్లు దుకాణాలు మూసివేయబడ్డాయి. దీనిపై కల్లు అమ్మకందార్లు హైకోర్టులో పిటీషన్ (నం. 18181/2024) వేయగా అప్పటి ప్రభుత్వం ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపాం వంటి వాటితో కల్తీ కల్లు తయారుచేస్తున్నారని దానితో ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని తెలిపినారు. అలాగే 2002 నుంచి 2004 వరకు సుమారు 98 మంది ప్రజలు ముఖ్యంగా పేదవారు కల్తీ కల్లు తాగి చనిపోయినారని కోర్టు వారికి తెలుపగా కోర్టువారు ప్రభుత్వవాదనలతో ఏకీభవిస్తూ, హైదరాబాదు నగరంలో కల్లు దుకాణాలు మూసివేయడాన్ని సమర్థించి కల్లు దుకాణదారుల కేసు కొట్టివేసినారు. ఈవిధంగా 2004 నుంచి సుమారు 10 సంవత్సరములు హైదరాబాదు నగరంలో కల్లు దుకాణాలు మూతబడ్డాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొద్ది నెలలలోనే మరల జి.ఓ. నం. 24 తేది 4-9-2014 నాడు మళ్ళీ కల్లు దుకాణాలు తెరవడానికి అనుమతులు ఇవ్వబడ్డాయి. దీనితో పేదవారు ఉండే బస్తీలలో గల్లీ గల్లీకి ఒకటి చొప్పున సుమారు వందవరకు కల్లు దుకాణాలు తెరచి విరివిగా కల్తీకల్లు అమ్మడం మొదలైంది. ఒకసారి మూసివేసిన కల్లు దుకాణాలు మళ్ళీ ఎందుకు తెరచినారని కమీషనర్ ఎక్సైజ్ వారిని సమాచారహక్కు చట్టం ద్వార అడుగగా వారు మేము ఎటువంటి ప్రపోజల్ ప్రభుత్వానికి పంపలేదు. మూతపడ్డ కల్లు దుకాణాలు తెరుచుట ప్రభుత్వ నిర్ణయమని ఇందులో మా ప్రమేయం లేదని లేఖ 1073/2014/C.P.E./E1 తేది 17-10-2014 ద్వార తెలిపినారు. బహుశా అప్పటి ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా కల్లు దుకాణాలకు లైసెన్స్ లు ఇచ్చి కల్తీ కల్లు అమ్మకానికి తెర లేపింది. ఒక హైదరాబాదు నగరంలోనే కాక రాష్ట్రమంతా కూడ కల్తీకల్లు అమ్మకం యధేచ్ఛగా జరుగుతుంది. కల్తీకల్లు అమ్మకం ఆపడానికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆబ్కారీ కమీషనర్ గారికి, ప్రధాన కార్యదర్శి గారికి ఎన్నో దరఖాస్తులు చేసినా ఫలితం లేకపోయింది. కనీసం కల్లు దుకాణాలలో అమ్మే కల్లుకు అప్పుడప్పుడు పరీక్షలు నిర్వహించాలని కోరినా ఆబ్కారీ శాఖ వారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం కల్తీ కల్లు తాగి ఎవరైనా మరణించినా అప్పటికప్పుడు హడావిడి చేయడం, కల్లు దుకాణదారునిపై కేసులు బనాయించినట్లు చూపించడం అటు తరువాత ఎటువంటి చర్యలు ఉండవు. ఆబ్కారీశాఖ వారు నెలవారీ మామూళ్ళతో సంతృప్తి పడుతున్నారే కాని కల్తీ కల్లు నిరోధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
డి-అడిక్షన్ సెంటర్‌లో ప్రతిరోజు 50 మంది వరకు బాధితులు వస్తున్నా, అది ఆబ్కారీశాఖ వారికి కనిపించడంలేదు. ఒకసారి కల్తీ కల్లుకు అలవాటు పడితే మానడం చాలా కష్టం. కల్తీ కల్లు లేని పక్షంలో అతడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తాడని ఒక ఆబ్కారీ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. తమిళనాడు రాష్ట్రంలో తాటి చెట్టు రాష్ట్ర వృక్షం. అచ్చట తాటికల్లు అమ్మడంపై నిషేధం ఉంది. అయితే గీత కార్మికులు తాటి చెట్టు నుంచి వచ్చిన కల్లును బెల్లంగా తయారుచేసి జీవనోపాధి పొందుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కల్తీకల్లు అమ్మకం ఆపడానికి ప్రభుత్వపరంగా ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర హైకోర్టులో కల్లు దుకాణాలు మూసివేయాలని పిల్ (7/2024) వేయడం జరిగింది. దీనిపై కోర్టువారు స్పందిస్తూ ఫిబ్రవరి 2024లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, ఎక్సైజ్ కమీషనర్లకు నోటీసులు జారీచేసింది. కేసు కోర్టులో పెండింగులో ఉంది.
పేదవారి ఆరోగ్యంపై ప్రభుత్వం చిన్నచూపు
హైదరాబాదు నగరంలో మాదకద్రవ్యాల వాడకం ఒక సమస్యగా తయారైంది. మాదకద్రవ్యాలు (డ్రగ్స్) ధనవంతులు, వారి పిల్లలు, సినిమారంగ సెలబ్రిటీస్ వాడుతున్నారు. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ అరికట్టడానికి ఒక ప్రత్యేక నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ నెలకొల్పి పబ్బులు, పార్టీలలో డ్రగ్స్ వాడకాన్ని అరికడుతున్నారు. హైదరాబాదు నగరంలో సుమారు 20 లక్షల పేదవారు 1500 మురికివాడలలో నివసిస్తున్నారు. ఈ పేదవారు కల్తీ కల్లు సేవిస్తూ తీవ్ర అనారోగ్యం పాలవుతున్నా ఆబ్కారీ శాఖ వారికి గాని, ప్రభుత్వానికి గాని ఏ మాత్రము పట్టింపులేదు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 47 ప్రకారము మత్తు పానీయాల సేవనలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు గైకొనాలి. కాని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మత్తు పానీయాల సేవనలకు ఊతమిస్తుంది.
2004 సంవత్సరంలో మూసివేసిన కల్లు దుకాణాలను మళ్ళీ 2014లో తెరిపించడం పెద్ద తప్పు. అది ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని తెలిసినా ఒక సామాజిక వర్గానికి సహాయం చేయడానికి తీసుకున్న చర్య. ఇది ఏ పరిస్థితిలోను సమర్థనీయం కాదు. ఇకపోతే ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు విచ్చలవిడిగా కల్తీకల్లు అమ్మకం విషయం తెలియనిది కాదు. ఇక అధికార గణం కూడ మామూళ్ళకు ఆశపడి కళ్ళు మూసుకుంటున్నారు. కల్తీ కల్లు సేవించే వారిలో సగము వరకు పేద మహిళలే ఉన్నారు. ఈ ప్రభుత్వం మహిళాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినారు. కల్లు దుకాణాలు బందు చేసినచో మహిళలకు ఎంతో లాభం కలుగుతుంది. బాధ్యతారహితంగా ప్రవర్తించి కల్తీ కల్లు తాగి చనిపోవడానికి కారణమైన కల్లు దుకాణదారులతో పాటు సంబంధిత అధికారులపై కఠిన చర్యలు గైకొనాలి. బాధిత కుటుంబాలకు కల్లు దుకాణదారులతో నష్ట పరిహారం ఇప్పించాలి. అలాగే 2004 ఆబ్కారీ పాలసీ ప్రకారం 50 కి.మీ. లోపు గీతకు పనికి వచ్చే ఈత మరియు తాటిచెట్లు లేని ప్రాంతాలలో కల్లు దుకాణాలు మూసివేయడానికి చర్యలు చేపట్టాలి.
యం. పద్మనాభరెడ్డి
అధ్యక్షులు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
ప్రభుత్వం లో అవినీతి, ప్రజల మధ్య నమ్మకాలను దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోంది. నిరుద్యోగం, పేదరికం, వలసలకు ప్రధాన కారణం. ఈ నిజాన్ని గుర్తించకుండా, కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో పరస్పరం భేదాభిప్రాయాలతో జీవనం సాగిస్తున్న వైనం విచారకరం.
నిజాయితీతో సాగే ఉద్యోగ జీవితం – కార్యాలయ వాతావరణంలో సవాళ్లు
ఈ రోజుల్లో ఉద్యోగ జీవితంలో నిజాయితీతో పనిచేయడం అనేది తుఫానులో వెలుగుతున్న దీపంతో ముందుకు సాగడం . కేవలం బయటి సమాజమే కాదు , కొన్నిసార్లు మన పని చేసే వద్ద ఉన్న సహచరులే మన సమాజంలో చెడు విలువల ప్రభావంతో మన నిబద్ధతను అర్థం చేసుకోకుండా, మద్దతు ఇవ్వకుండా నిరుత్సాహపరుస్తుంటారు. అప్పుడు నిజాయితీతో పనిచేసే మార్గం మరింత కష్టతరమవుతుంది.
పోటీ ప్రపంచంలో త్వరిత ఫలితాల కోసం తప్పుడు మార్గంలో ప్రయాణం, హడావుడి వంటి నిర్ణయాలు ,ఇతరులతో పోల్చుకుని జీవించడం, పెరిగిపోతున్నాయి. ఈ పరుగు లో నిబద్ధత నైతికత, పారదర్శకత” వంటి విలువలు రెండవ స్థానానికి వెళ్తున్నాయి. సులభ మార్గాల ద్వారా పైకి ఎదగాలని తపనతో ఎక్కువ మంది అవినీతి పరులుగా మారుతున్నారు . అప్పుడు కొందరు సత్యమార్గములో నడిచినప్పటికీ, అనవసర ఒత్తిడి, ఒంటరితనమూ ఎదురవుతుంది.
ఈలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ ధర్మాన్ని మరిచిపోకుండా, మనం ఎందుకు నిజాయితీగా వ్యవహరించాలో గుర్తుంచుకోవడం. నిజాయితీ అంటే స్వలాభం కోసం కాదు , మన వృత్తిపరమైన గౌరవం, వ్యక్తిత్వం కోసం. దీని వల్ల ఉద్యోగ జీవితంలో పనిలో ఆనందం ప్రశాంతత, సహోద్యోగుల వద్ద నిశ్చలత్వం,గౌరవం, భవిష్యత్తులో స్థిరత్వం ఏర్పడుతుందని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి.
కార్యాలయంలో అలాంటి మంచి వాతావరణం నెలకొనడానికి సహచరులతో సహనంతో మెలగాలి. వారు మన స్థానం గుర్తించకపోయినా, మన నడవడిని గమనిస్తారు. నిరంతరం పనిచేస్తూ, నిబద్ధతతో సమస్యలు ఎలా పరిష్కరించాలో ధైర్యంగా చూపగలిగితే, మన ఆచరణే వారి ఆలోచనను మార్చగలదు.
అలానే, పనిలో ప్రేరణ కోసం మనలాగే ఆలోచించే సహోద్యోగులతో సంబంధాలు పెంచుకోవాలి. పని సామర్థ్యం పెంపునకు నిజాయితీని ప్రదర్శించగలిగితే, మన మాటకన్నా పనే పెద్ద మార్పు తీసుకురాగలదు.
ప్రజల పన్నులతో జీతాలు పొందుతున్న ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వాలకు నమ్మకం కలుగుతుంది
చివరిగా గుర్తుంచుకోవాల్సింది నిజాయితీతో పనిచేసే ఉద్యోగి ఈ కాలంలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు మొదట ఒంటరిగా అనిపించినా, కాలక్రమంలో ఆ విలువలే అతన్ని భద్రమైన ఉన్నత స్థానానికి తీసుకెళ్తాయి. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకుంటే ఆయా కార్యాలయాల్లో ఒక్కరి వల్లనైనా మార్పు దిశగా అడుగులు వేస్తే అవినీతి రహిత సమాజం ఏర్పడుతుంది .
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
కోర్టు ఆదేశాలకు విలువ ఏది ?
ప్రభుత్వం అంటే కేవలం పరిపాలనా యంత్రాంగం కాదు. అది ప్రజల విశ్వాసంపై ఆధారపడిన సామూహిక భాద్యత. ఈ విశ్వాసం మాటల ద్వార బలపడుతుంది. మాట నిలబడకపోతే పాలన పునాది నలుగుతుంది. తాజా సినీ పరిణామాలు ఈ విషయంలో ప్రభుత్వ వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. పెట్టుబడిదారుల స్క్రీన్‌ప్లే లో ప్రభుత్వ హామీ, కోర్టు తీర్పు కామెడీ పాత్రలుగా మారిపోయాయి.
ఇక ధరలు పెంచం అని చెప్పి :
పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం చెందిన విషాదకర ఘటన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికపై స్వయంగా కీలక ప్రకటన చేశారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇవ్వబోమని స్ఫష్టం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కూడ ఇదే మాటని తిరిగి చెప్పారు. ప్రజలు దీనిని బాధ్యతాయుతమైన ప్రకటనగా స్వీకరించి ప్రభుత్వంపై మరింత నమ్మకం ఉంచారు. కాని ఈ హామీ ఇచ్చిన కొద్ది రోజులకే గేమ్ ఛేంజర్ సినిమా కోసం విడుదల చేసిన జి.ఓ.లో టికెట్ ధరలు పెంచడమే కాక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం చూసినప్పుడు ఇచ్చిన మాట ఎంత తేలికగా విస్తరించబడుతోందో తెలుస్తుంది.
కోర్టు ఆదేశాలు పక్కన పెట్టి :
ఈ జి.ఓ. పై జర్నలిస్టు సతీష్ కుమార్ హైకోర్టును ఆదేశించగా న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులతో జి.ఓ.ను నిలిపివేసింది. అయినప్పటికీ, ఇదే తీరు “హరి హర వీరమల్లు” సినిమాతో మళ్ళీ పునరావృతం కావడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కోర్టు ఆదేశాలు, అసెంబ్లీలో చేసిన హామీ, ప్రజల నమ్మకం అన్నీ పక్కనపెట్టి, మరొకసారి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు అనుమతిస్తూ జి.ఓ. జారీచేయడం అనేది సామాన్యప్రజలకు ప్రభుత్వ నైతికత పై తలెత్తే అనుమానాలను బలపరుస్తోంది.
విషయం చిన్నదే కాని :
ఇది చిన్న విషయం కాదని గుర్తుంచుకోవాలి. జి.ఓ. ఒక చిన్న పరిపాలన ప్రక్రియ మాత్రమే కావచ్చు. కాని దాని వెనుక దాగి ఉన్న నమ్మకం చాలా పెద్దది. ఒక హామీని నిలబెట్టుకోలేని ప్రభుత్వం, ఇతర ముఖ్యమైన వ్యవహారాలలోను వెనుకడుగు వేయడాన్ని సమర్థించలేము. సినీరంగానికి తలవంచిన పాలకులు రేపు ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలోను, రైతుల సమస్యల విషయంలోను అదే వైఖరి తీసుకునే ప్రమాదం ఉందన్న అనుమానం సహజం.
చిన్న పరీక్ష కాదు – మౌళిక పరీక్ష :
ఈ పరిణామాలలో ఎవరు బాధపడుతున్నారు అనే ప్రశ్న తలెత్తక మానదు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వలన లాభపడేది కొద్ది మంది స్టార్ నిర్మాతలే. కాని అసౌకర్యాన్ని అనుభవించేది సామాన్య ప్రేక్షకులు. కొందరి లాభాల కోసం ప్రభుత్వ విధానాలే మారిపోతే, ప్రజల సంక్షేమమే ప్రధానంగా భావించాల్సిన ప్రభుత్వం తన ప్రాధాన్యతలను తప్పు దారి పట్టించిదని ఒప్పుకోక తప్పదు. ఇది ప్రభుత్వానికి చిన్న పరీక్ష కాదు, ఇది మౌళిక పరీక్ష. హామీ ఇవ్వడంలో నాయకత్వం లేదు. దాన్ని నిలబెట్టుకోవడంలోనే నిజమైన నాయకత్వం తళుకుపడుతుంది. ఇక ముందైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిద్ధాం. ప్రజల హితం కంటే పెట్టుబడిదారుల లాభం ముఖ్యం అవ్వకూడదు.
సయ్యద్ రఫీ
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మెంబర్
చెడుకు దూరంగా ఉండు
మంచికి దగ్గరగా ఉండు.
నీ విలువ ఎప్పుడు ఉన్నతంగా ఉంటుంది
FGG IN NEWS
FGG IN ACTION
FGG Submitted representations to various departments in the month of JULY 2025
- To the Chief Electoral Officer regarding Spending Rs. 70 crores for MLA elections of Smt. Konda Sureka (Hon’ble Minister for Forests) Statement by Sri Konda Murali (Ex-MLC) request for inquiry – on 1-7-2025
- To the Chief Secretary regarding To comply with the directions issued by the Hon’ble Supreme Court in the Judgements/Orders dt. 17-12-2024 and 13-11-2024 in the cases titled Rajendra Kumar Barjatya and Another vs. U.P. Avas Evam Vikas Parishad & Ors. reported at 2024 INSC 990; and In Re : Directions in the matter of demotion of structures reported at 2024 SCC Online SC 3291, respectively on 2-7-2025
- To the Chief Secretary regarding Adilabad district – Lack of bridges on streams – Students and villagers facing difficulties to cross swollen streams – Request to construct bridges where ever necessary – on 7-7-2025
- To the Minister, Health, Medical & Family Welfare department regarding Food adulteration – Request for appointment of Food Safety officers to control food adulteration on 8-7-2025
- To the Governor, regarding Squandering of Tax Payer’s money for political gains – Request for inquiry on 11-7-2025
- To the Chief Minister regarding Corruption in administration – A.C.B. cases not pursued properly leading to delay and acquittal of cases – Request to review the ACB cases – on 15-7-2025
- To the Prl. Secretary, Health, Medical & Family Welfare department regarding Dental College – Issue of fake certificates – Request for inquiry – on 17-7-2025
- To the Chief Minister regarding Special Development Fund – Mis use of funds – Request for inquiry by D.G. V&E and stop squandering of Tax payer’s money – on 23-7-2025
- To the Secretary, Tribal Welfare department regarding Forest Conservation Act 1980 – violation of instructions issued by CEC- illegal diversion of lakhs of acres of forest lands by the Telangana State Govt. for political gains – under disguise of Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act 2006 – on 24-7-2025
- To the Prl. Chief Conservator of Forests, Aranya Bhavan regarding Forest Conservation Act 1980 – violation of instructions issued by CEC- illegal diversion of lakhs of acres of forest lands by the Telangana State Govt. for political gains – under disguise of Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act 2006 – on 24-7-2025
FGG submitted following RTI letters to various departments in the month of JULY 2025
– To the PIO, O/o Prl. Secretary, Planning department regarding MPLADS – on 2-7-2025
– To the PIO, O/o Chief Planning Officer regarding Additional information of C.D.P. funds – on 5-7-2025
– To the PIO. O/o Prl. Secretary, MA&UD department regarding LRS applications on 10-7-2025
– To the PIO, O/o Director General, ACB regarding cases booked & disposal during last 5 years – on 10-7-2025
– To the PIO, O/o Prl. Secretary, School Education department regarding action taken on our representation – on 14-7-2025
– To the PIO, O/o Dy. Commissioner, Bandlaguda Municipality, regarding unauthorised layouts – on 14-7-2025
-To the PIO, O/o Executive Engineer, Lakes division regarding encroachment of lakes, Lands, Parks etc. – on 14-7-2025
-To the PIO, O/o MRO, Kondapur regarding encroachment of Govt. lands – on 14-7-2025
-To the PIO, O/o Commissioner, GHMC regarding Pollution – on 15-7-2025
– To the PIO, O/o Chairman, TS Pollution Control Board, Hyderabad Regional office, regarding notices issued to hospitals – on 15-7-2025
-To the PIO, O/o Spl. Chief Secretary regarding unauthorised constructions – on 16-7-2025
– To the PIO, O/o Asst. Secretary, V&E department regarding Vigilance report -on 24-7-2025
-To the PIO, O/o Director General, V&E department regarding MBT PIL – on 25-7-2025
-To the PIO, O/o Prl. Secretary, MA&UD department regarding MBT PIL – on 25-7-2025
-To the PIO, O/o Lokayukta, regarding annual report – on 31-7-2025
-To the PIO, O/o Chief Electoral Officer, GA (Elections) department regarding audit of the election budget – on 31-7-2025
FGG TIMES
M. Padmanabha Reddy I.F.S.(R) (President)